సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పీఎం రహత్ (PM RAHAT – Prime Minister Road Accident Victim’s Hospitalisation and Assured Treatment) పథకాన్ని అర్హులైన బాధితులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మొత్తం 63 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్ఠంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు కాల్ చేయాలి. క్షతగాత్రులను వీలైనంత త్వరగా సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆసుపత్రికి తరలించేలా సహకరించాలి. పథకం కింద వైద్య సేవలు పొందేందుకు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించి, అవసరమైన వివరాలను అందించాలి. ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి, పోలీసులకు మరియు వైద్య సిబ్బందికి సహకరించాలి.రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రజలు పీ.ఎం.రహత్ పథకంపై అవగాహన పెంపొందించుకుని అర్హులైన బాధితులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

