జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వ్యవసాయ రంగంలో రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” లో భాగంగా గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో రైతు అవగాహన సదస్సు మొగిలిచర్ల సొసైటీ చైర్మన్ కొండేటి కొమరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పెట్టుబడి ఖర్చులను తగ్గించి, రైతులకు స్థిరమైన నికర ఆదాయాన్ని సాధించిపెట్టడమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశమన్నారు.నేల పరీక్ష ఆధారంగా నేలలోని పోషకాలను శాస్త్రీయంగా పరీక్షించి, అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడాలని, పంట అవసరాలకు తగ్గట్టు పోషకాలను సరైన నిష్పత్తిలో అందించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, మల్చింగ్, పంట మార్పిడి స్థానిక జీవ వనరులను ప్రోత్సహించాలన్నారు. రైతులు పంటల వైవిధ్యీకరణను పాటిస్తూ నేల, నీరు మరియు మార్కెట్ డిమాండ్‌ను బట్టి వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ వంటి నూనెగింజపంటలు, పెసర, మినుము, కందులు, బొబ్బెర, శనగ వంటి పప్పుధాన్యాలు మరియు ఉద్యాన పంటల వైపు మళ్ళాలని అన్నారు. సుస్థిర సాగు పద్ధతులు అవలంబిస్తూ భవిష్యత్ తరాల కోసం నేల సారాన్ని, భూగర్భ జలాలను పరిరక్షించాలని రైతులను కోరారు.వర్ధన్నపేట సహాయ వ్యవసాయ సంచాలకులు నర్సింగం మాట్లాడుతూ విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు అధీకృత డీలర్ల వద్దే కొనుగోలు చెయ్యాలని, ఎంఆర్పీ ధరలను పరిశీలించి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. నిషేధిత కలుపు మందులను వాడకూడదని విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడి నేల ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదని రైతులకు సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధికి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవడం తప్పనిసరి అన్నారు.పంట అవశేషాలను కాల్చివేయకుండా మల్చింగ్ లేదా భూమిలో కలియదున్నడం ద్వారా నేల సారాన్ని పెంచాలన్నారు.జాతీయ ఆహార భద్రత మిషన్ వరంగల్ జిల్లా కన్సల్టెంట్ సారంగం మాట్లాడుతూ సమగ్ర పోషక నిర్వహణ (INM) లో భాగంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవ ఎరువులను సమన్వయం చేస్తూ పంటను ఎలా సాగు చేసుకోవాలో రైతులకు వివరించారు. సమగ్ర సస్యరక్షణ (IPM) విధానాలను పాటిస్తూ ఆర్థిక నష్ట పరిమితి (ETL)ని గమనించి, జీవ-యాంత్రిక నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార ఆరోగ్య కార్డులో , సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను లెక్కించి వేయాలన్నారు.నీటిని సంరక్షిస్తూ బిందు, తుంపర సూక్ష్మ సేద్య విధానాలను ఆచరించాలని, యాసంగిలో వరి పంటను పూర్తిగా మానేయాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలను, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎన్నుకొని యాసంగి సాగు చేపట్టాలన్నారు.పిఎసిఎస్ చైర్మన్ కొమురారెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల ఆసక్తి చూపెట్టాలని, మొగిలిచర్ల గ్రామాన్ని ప్రకృతి వ్యవసాయం కోసం ఎంపిక చేయాలని, డ్రిప్ పరికరాలు సబ్సిడీ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు జి.రాజేష్ బి.భరత్ సీఈఓ కుమారస్వామి, సొసైటీ డైరెక్టర్లు ఎరువుల డీలర్లు కిరణ్,మనోహర్,ఉమేష్, రైతులు పాల్గొన్నారు
