జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ :
వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్ శుక్రవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ “ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047: అవకాశాలు – సవాళ్లు” అనే అంశంపై వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ యాజమాన్యాలకు చెందిన 18 పాఠశాలల విద్యార్థులు తమ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ప్రస్తుత మనం ఎక్కువగాఆధారపడుతున్న శిలాజ ఇంధనాల అత్యధిక వాడకం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి నుండి 2047 నాటికి 50% పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ వైపు మారాల్సిన ఆవశ్యకతను ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ , చార్టుల ద్వారా వివరించారు.ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ హాజరైనారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ “ఇంధన భద్రత అనేది దేశ ఆరోగ్య భద్రత వంటిదే. మన చమురు మీద దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడానికి సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి స్వదేశీ ఇంధన వనరులను ప్రోత్సహించడం అత్యవసరం. విద్యార్థులు చెప్పిన పరిష్కారాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి” అని అన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి మహేష్ నాయక్ మాట్లాడుతూ 2047 నాటికి విద్యుత్ డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందాని, దాన్ని కేవలం బొగ్గుతో తీర్చలేం కావున కాలుష్యాన్ని తగ్గిస్తూ, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన సామర్థ్యం గురించి ఆలోచించాలి అన్నారు. ఈ సెమినార్ ఆ దిశగా విద్యార్థుల్లో చైతన్యం నింపింది” అని అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి వేదికలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయని అన్నారు.ఈ సెమినార్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామునూరు క్యాంప్ కు చెందిన సహస్ర (గైడ్ టీచర్ అనితా లత) మొదటి బహుమతి గెలుచుకోగా, తెలంగాణ మోడల్ పాఠశాల, వంచనగిరికి చెందిన హుమెరా ఫిర్దౌస్ (గైడ్ టీచర్ డా|| సీ.హెచ్ రవి) ద్వితీయ బహుమతిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుల్లికుంట కు చెందిన ఎ. నైషిక (గైడ్ టీచర్ సీ.హెచ్ కృష్ణా రెడ్డి) తృతీయ బహుమతి గెలుచుకున్నారు. కాగా, నర్సంపేట కు చెందిన అక్షర ఉన్నత పాఠశాల విద్యార్థిని హరిప్రియ (గైడ్ టీచర్ గౌతమ్), ప్రభుత్వ ఉన్నత పాఠశాల మట్టెవాడ కు చెందిన సి హెచ్ రశ్విత (గైడ్ టీచర్ ప్రభాకర్) లు కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నారు.
జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి ఈ నెల 29 న, ఎస్.సి.ఇ.ఆర్.టి, హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సెమినార్ లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరఫున షీల్డ్ లు బహుకరించారు. జిల్లా విద్యాశాఖ తరఫున విద్యార్థులకు, గైడ్ టీచర్లకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నిర్వహణలో సైన్స్ టీం సభ్యులు రాంగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రవణ్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
