కాకతీయ విశ్వవిద్యాలయంలో “విద్యార్థి పారిశ్రామికవేత్త నుంచి విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడిగా ప్రయాణం” అనే అంశంపై బయోరిఫార్మ్ వ్యవస్థాపకుడు, సీఈఓ మహమ్మద్ అజర్ మొహియుద్దీన్ అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కేయూ కే-హబ్, హైదరాబాద్ టీ-హబ్‌తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న సెనెట్ హాల్‌లో మద్యహ్నం నిర్వహించిన స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్లో ఆయన ఎంపిక చేసిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశలో తాను రూపొందించిన ఆలోచనను విజయవంతమైన స్టార్టప్‌గా అభివృద్ధి చేసిన తన ప్రయాణాన్ని ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. మొక్కజొన్న పిండి ఉత్పన్నాలతో సహజంగా క్షీణించే పర్యావరణహిత ప్యాకేజింగ్ ఉత్పత్తులను బయోరిఫార్మ్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాపార లాభదాయకతను సాధించేలా అందుబాటు ధరలో నాణ్యమైన, బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్యాకేజింగ్ పరిష్కారాలను అందిస్తున్నట్లు వివరించారు. వాస్తవ ప్రపంచంలోని పర్యావరణ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసి, వాటిని విస్తరించగలిగే విజయవంతమైన వ్యాపారాలుగా మలచవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో రూసా-2.0 నోడల్ ఆఫీసర్ ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న, కే-హబ్ కోఆర్డినేటర్లు బి. కిరణ్ కుమార్, ఎ. సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.