Preloader
భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలో విజయాన్ని సాధించేందుకు పటిష్టమైన వ్యాపార ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచన, సమర్థవంతమైన నిర్వహణ కీలకమని పండోరాస్ బాక్స్‌ వ్యవస్థాపకురాలు, సర్టిఫైడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ మిలి కటారియా అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కే-హబ్, హైదరాబాద్ టీ-హబ్తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న సెనెట్ హాల్‌లో నిర్వహించిన” స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌” లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపిక చేసిన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వ్యవసాయ సాంకేతికత (అగ్రిటెక్), ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్), రిటైల్‌ తదితర రంగాల్లో స్టార్టప్‌ల విజయానికి తాత్కాలిక ప్రచారం కంటే వ్యాపార మౌలిక సూత్రాలు, సరైన వ్యూహాలు, కార్యాచరణ సామర్థ్యం ఎంతో ముఖ్యమని మిలి కటారియా వివరించారు. స్టార్టప్‌లను ప్రారంభించడం, విస్తరించడం, దీర్ఘకాలికంగా విజయవంతంగా కొనసాగించడం కోసం పటిష్టమైన పునాదులు అవసరమని పేర్కొన్నారు. 25 ఏళ్లకు పైగా వ్యాపార, కార్పొరేట్ రంగ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని స్టార్టప్‌ల అభివృద్ధికి అవసరమైన అంశాలను ఆమె విద్యార్థులకు వివరించారు. టీ-హబ్, స్టాన్‌ఫోర్డ్ సీడ్, వాధ్వాని ఫౌండేషన్, దేశ్‌పాండే స్టార్టప్స్, స్టార్టప్ తెలంగాణ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు (AICs) వంటి సంస్థలు స్టార్టప్‌ల ప్రోత్సాహంలో పోషిస్తున్న పాత్రను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు (FDPs) నిర్వహించడంతో పాటు, పాఠ్యప్రణాళికల్లో పారిశ్రామికవేత్తల నైపుణ్యాలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. హెడ్‌స్టార్ట్ నెట్‌వర్క్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారంతో యువతలో ఆవిష్కరణలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో పారిశ్రామిక ఆలోచనలను ప్రోత్సహించి, భవిష్యత్తులో స్థిరమైన స్టార్టప్‌ల ఏర్పాటుకు అవసరమైన పునాదులను బలోపేతం చేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో రూసా నోడల్ ఆఫీసర్ ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, కే-హబ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

30 September 2026

భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలో విజయానికి వ్యాపార మౌలిక సూత్రాలు కీలకం

www.jaibharatvoice.com