– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
*(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు):*
కుష్టు వ్యాధుల పట్ల ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది, అధికారులు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య అన్నారు.
ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 14 రోజుల పాటు నిర్వహించే ఇంటింటి కుష్టు వ్యాధి అవగాహన మరియు నిర్ధారణ ఉద్యమం కార్యక్రమాన్ని ఆత్మకూరు పీహెచ్సీలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ. అప్పయ్య ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరీరంపై తెల్లని లేదా ఎర్రని, స్పర్శ తెలియని మచ్చలు ఉంటే అది కుష్టు వ్యాధి లక్షణంగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, క్రమం తప్పకుండా మందులు వాడితే కుష్టును పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదని, అపోహలను వీడాలని, ఇంటింటి సర్వే ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని, అనుమానిత కేసులను గుర్తించి పీహెచ్సీకి తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు భయపడకుండా ముందుకు రావాలని కోరారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్ మోహన్, మెడికల్ ఆఫీసర్ డా. కె. స్పందన, డీఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు ఎల్లయ్య, రవీందర్, సువార్త, దేవిసింగ్, సీహెచ్ఓ జూనేది, హెచ్ఎస్ రమేష్, హెచ్వి రాజ్యలక్ష్మి మరియు వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
