- పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజాప్రతినిధుల రక్తదానం – ప్రాణదాతలుగా నిలిచిన యువత
(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు)
- పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా పరకాల పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పరకాల సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్మారకార్థం యువత రక్తదానం చేయడం అభినందనీయమని అధికారులు కొనియాడారు.
ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ…రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరులు దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించారని, వారి త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు, ఆత్మకూరు సీఐ బాబులాల్, పరకాల, శాయంపేట సీఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులను, ప్రజాప్రతినిధులను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, , యువజన సంఘాల నాయకులు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు ఆత్మకూరు యువకులు రక్తం దానం చేశారు.
