Preloader
యాసంగిలో ఆరుతడి పంటలే మేలు
– ఏఈఓ ప్రవళిక

(జై భారత్ వాయిస్ న్యూస్- ఆత్మకూరు):

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంటను వేయవద్దని వ్యవసాయ విస్తరణ అధికారి జి. ప్రవళిక అన్నారు. ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ గ్రామంలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమంలో భాగంగా వరి పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడకపోవడంతో యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పుదినుసులు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు.పంటలు కోసిన తర్వాత వాటి అవశేషాలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోయి నేల సారం, నీటి సామర్థ్యం తగ్గడంతో పాటు కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.ప్రతి రైతు మట్టి పరీక్ష చేయించుకుని, ఆ రిపోర్టు ఆధారంగానే ఎరువులు వాడాలని, దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడి దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అలాగే పంటలకు కాలువల ద్వారా కాకుండా డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ద్వారా నీరు అందించడం వల్ల నీరు ఆదా అవడంతో పాటు దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగుల మహేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ బోరిగం స్వామి,మాదాసి సుహాసిని, ఆలియా, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

24 October 2026

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు

www.jaibharatvoice.com