జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ: పాత్రికేయ వృత్తిలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్ట్ గజ్జెల శ్రీనివాస్‌ను లయన్స్ క్లబ్ జిల్లా 320ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జిల్లా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంగెం మండలానికి చెందిన జర్నలిస్ట్ గజ్జెల శ్రీనివాస్ పాత్రికేయ రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి సత్కరించారు. 2003లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ తొలుత వార్త దినపత్రికలో పనిచేసి, ప్రస్తుతం సాక్షి దినపత్రికలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. గతంలోనూ లయన్స్ క్లబ్ ద్వారా ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా లయన్స్ గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌లో భాగంగా సమాజ సేవలో ముందుండే జర్నలిస్టులు, వైద్యులు, ఇంజనీర్లను సత్కరించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది జర్నలిస్టులను సన్మానించి, వారు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి అభినందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పివి మదన్ మోహన్ ,పొట్లపల్లి శ్రీనివాసరావు,విడిజి-1 రమణా రెడ్డి, పీఆర్వో అజీత్, చీఫ్ కోఆర్డినేటర్ టి. నరేందర్, పీడీజీలు కన్నా పరుశరాములు , పొట్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, నరహరి, పరికిపండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.