Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ 
యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం  యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల  వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కొంతమంది యువత సరదా, స్నేహితుల ప్రభావం, ఆసక్తి వంటి కారణాలతో మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఏమవుతుందనే నిర్లక్ష్య ధోరణి ప్రమాదకరమని, అదే క్రమంగా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. మాదకద్రవ్యాలు కేవలం శరీరానికి మాత్రమే హాని చేయవని, అవి మొత్తం కుటుంబాన్ని, సామాజిక సంబంధాలను, మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. యువత తమ విలువైన జీవితాన్ని మత్తు పదార్థాలకు బలి చేయకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. మాదక ద్రవ్యాలు అనేది సమాజానికి పెద్ద సమస్యగా మారిందని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తును కాపాడుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా నష్టపోతారని తెలిపారు. విద్యార్థులు తమ స్నేహితుల్లో ఎవరైనా మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నట్లు గుర్తిస్తే వారిని చైతన్యపరచి సరైన మార్గంలోకి తీసుకురావాలని సూచించారు. కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సంచాలకులు ఆచార్య ఈసం నారాయణ మాట్లాడుతూ… జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవా భావన, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని, తమతో పాటు సమాజంలోని ఇతరులను కూడా చైతన్యపరచాలని కోరారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. యువత క్రీడలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ కుమార్‌స్వామి మాట్లాడుతూ… మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన, ఆరోగ్యపరమైన, సామాజిక పరిణామాలపై  విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు బాధ్యతాయుతంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని  కోరారు. యువత అప్రమత్తంగా ఉండి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రమేష్, డాక్టర్ చందర్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

29 September 2026

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

www.jaibharatvoice.com