(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు )గ్రామీణ ప్రాంతాల్లోని డప్పు కళాకారులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మార్పీఎస్ ఆత్మకూరు మండల ఇంచార్జ్ నద్దునూరి రఘు అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గ్రామంలో అదివారం జరిగిన డప్పు కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ… గ్రామాల్లో పండుగలు, ఉత్సవాలు అంటేనే డప్పు కళాకారుల చప్పుళ్లు లేకుండా జరగవని గుర్తు చేశారు. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, దసరా వంటి పండుగలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో కూడా డప్పు కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కానీ అదే కళాకారులు పండుగలు అయిపోయిన తర్వాత పనులు లేక ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. “డప్పునే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలు నీరుకుల్లతో పాటు ఆత్మకూరు మండలంలో అనేక గ్రామాల్లో ఉన్నాయని అన్నారు. రోజువారీ పని దొరకక, సరైన ఆదాయం లేక వారి పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారింది” అని ఆయన అన్నారు. డప్పు కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందించాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలను డప్పు కళాకారులకు ప్రత్యేకంగా వర్తింపజేయాలని చెప్పారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి వడ్డీ లేని రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పించాలని కోరారు. మండల స్థాయిలో అర్హులైన ప్రతి డప్పు కళాకారుల కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, నెలవారీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
డప్పు అనేది కేవలం వాయిద్యం కాదు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని, అలాంటి కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘు స్పష్టం చేశారు. త్వరలో ఈ సమస్యలపై కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరుకుల్ల గ్రామ డప్పు కళాకారులు, యువకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
