Preloader
క్రీడా మైదానం ఉంది..
కానీ క్రీడలకు పనికిరాదు!
-జాతీయ రహదారిపైనే యువత మార్నింగ్ వాక్ ..
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం నిర్మించిన మైదానం నిరుపయోగంగా మారిందని, జాతీయ రహదారిపైనే మార్నింగ్ వాక్ చేయవలసి వస్తున్నదని ఆత్మకూరు మండల ప్రజలు వాపోయారు.
ఆత్మకూరు మండల కేంద్రంలోని క్రీడా మైదానం నిర్వహణ లేక అధ్వాన్నంగా మారింది. సదుద్దేశం తో ఏర్పాటు చేసిన ఈ మైదానం ప్రస్తుతం క్రీడాకారులకు ఉపయోగపడని పరిస్థితికి చేరుకోవడంతో స్థానిక యువత, క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

క్రీడా మైదానమా.. పిచ్చి మొక్కల మైదానమా?

మండలంలోని యువత, విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఏర్పాటు చేసిన మైదానంలో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు. మైదానం మొత్తం గుంతలమయంగా మారడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి క్రీడలకు అనుకూలంగా లేకుండా పోయిందని మండల వాసులు వాపోయారు.
మైదానం ముందున్న నామఫలకం తుప్పు పట్టి పోయింది. క్రీడాకారుల భద్రతకు అవసరమైన కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పశువులు, ఇతరులు మైదానంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

తుప్పు పట్టిన ఫిట్‌నెస్ పరికరాలు.

యువత వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ బార్స్, ఇతర వ్యాయామ పరికరాలు విరిగిపోయి, తుప్పు పట్టి నిరుపయోగంగా మారాయి. దీంతో మైదానం ఉన్నప్పటికీ యువతకు సరైన వ్యాయామ, క్రీడా సదుపాయాలు అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

మార్నింగ్ వాక్‌కు కూడా భద్రత కరువు..

మైదానంలో వాకింగ్ ట్రాక్ లేకపోవడంతో స్థానిక యువత, మహిళలు, విద్యార్థులు ప్రజలు ఆత్మకూరు జాతీయ రహదారిపై మార్నింగ్ వాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. జాతీయ
రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రమాదాల భయం వెంటాడుతోందని వారు చెబుతున్నారు.

“ప్రాక్టీస్ చేసేందుకు కూడా మైదానం లేదు”

జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమయ్యే గ్రామీణ క్రీడాకారులకు కనీసం ప్రాక్టీస్ చేసుకునేందుకు కూడా సరైన వసతులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైదానం పరిస్థితిపై సంబంధిత అధికారులకు పలుమార్లు తెలిపినా తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానిక క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా?

ప్రభుత్వం భూమి లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం ఇలా నిరుపయోగంగా మారడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైదానాన్ని వెంటనే శుభ్రం చేసి, గుంతలను పూడ్చి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని, విరిగిపోయిన క్రీడా పరికరాలను మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని యువత డిమాండ్ చేస్తోంది.

  • క్రీడాకారుల భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన మైదానం.. ఇలా నిర్లక్ష్యానికి గురికావడం ఎంతవరకు సమంజసం క్రీడాకారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆత్మకూరు క్రీడా మైదానానికి పునర్జీవం పోయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

Share this news as a Photo Card

30 September 2026

క్రీడా మైదానం ఉంది. కాని క్రీడలకు పనికిరాదు.

www.jaibharatvoice.com