జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ :తాగునీటి సరఫరాకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని,పకడ్బందీ ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎల్ నినో సన్నద్ధత, విబిజి రాంజీ, ఆర్డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ముందుగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సీతక్కకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మొక్కను అందించి స్వాగతం పలికారు.ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఎల్ నినో, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. సాగునీరు, తాగునీరుకు సంబంధించిన అంశాలను సాగునీటి పారుదల శాఖ అధికారులు, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ తాగునీరు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చేపట్టే బోర్ రీచార్జ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, నీటి నిల్వలు, రిజర్వాయర్లు, బోర్లు, మోటార్లు తదితర వాటి పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని పేర్కొన్నారు.ముఖ్యంగా వేసవి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని తాగునీరు సరఫరా చేయాలని సూచించారు.ప్రతీ ఇంటింటికీ ఇంకుడు గుంత, ప్రతీ పంటకు పంట కుంటలను,ప్రతీ ఊరు కి ఊట కుంట లను నిర్మించాలన్నారు
గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి రీచార్జ్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అవసరమైన తాగునీటి వసతులను కూడా ప్రత్యేకంగా పరిశీలించాలని అన్నారు.ప్రజలకు సరఫరా చేసే నీరు స్వచ్ఛమైనదిగా.. సురక్షితమైనదిగా ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో తాగునీటి వనరుల పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.ముఖ్యంగా చిన్న, పెద్ద మోటార్ల మరమ్మతులు, పైపులైన్ల సమస్యలు తదితర సమస్యలను వెంటనే గుర్తించి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని తెలిపారు.అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగునీరు, తాగునీటి సరఫరాకు సంబంధించి గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. ప్రతిపాదిత పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టెందుకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.రోడ్లు, వంతెన, చెక్ డ్యామ్, తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల పరిధిలో చేపట్టిన హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఆవాసం నుండి గ్రామానికి, గ్రామం నుండి మండల కేంద్రానికి రహదారి సదుపాయం ఉండాలనేదే హ్యామ్ రోడ్స్ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి కల్పించడం ద్వారా కూలీలకు ఉపయోగపడాలన్నారు. ఉపాధి కల్పించడం ద్వారా గ్రామం సమగ్రభివృద్ది చెందుతుందన్నారు. గ్రామాభివృద్ధికి ఇదొక వరంలాంటిదన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించాలని అన్నారు. పథకం ద్వారా చేపట్టిన పనుల పురోగతి పై ప్రతి పదిహేను రోజులకోసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. పనులను పూర్తి చేయడంలో, కూలీలకు ఉపాధి కల్పించే విషయంలో స్థానిక సర్పంచులను భాగస్వామ్యం చేయాలన్నారు.
ఈ సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఎల్ నినో ప్రభావం ప్రధానంగా వాతావరణం వ్యవసాయం వర్షపాతం నీటి లభ్యత వంటి కీలక రంగాలపై పడే అవకాశం ఉందన్నారు.వర్షపు నీరును ఒడిసిపట్టడం నిల్వ చేయడం భూగర్భ జలాలను పెంచడం నీటి సంరక్షణ చర్యలను చేపట్టడం అత్యంత ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో కూడా కొన్ని ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదు ఉన్నప్పటికీ భవిష్యత్తులో వర్షపాతం స్థిరంగా ఉండే పరిస్థితిలో దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశం లో స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి,హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ లు చాహత్ బాజ్ పాయి,అడిషనల్ కలెక్టర్లు, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ENC జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు
