జాతీయ రహదారిపై ఉన్న ఆత్మకూరు మండలం లోని గూడప్పాడు కూడలిని పూర్తిస్థాయి జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గూడప్పాడు కూడలి మీదుగా హనుమకొండ, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల వైపు నిత్యం పెద్ద సంఖ్యలో లారీలు, కార్లు , ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
అయితే కూడలి తగినంత వెడల్పు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా లారీల రాకపోకలు అధికంగా ఉండటంతో చిన్న వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూడలి వద్ద రహదారి విస్తీర్ణం సరిపోక పోవడంతో పలు గ్రామాల ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.అదేవిధంగా కూడలి వద్ద తగిన ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి సమయంలో వాహనాల రద్దీ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
గూడప్పాడు కూడలిని విస్తరించి, అవసరమైన చోట రహదారి వెడల్పు చేసి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తే రానున్న కాలంలో ప్రయాణికులకు, స్థానిక గ్రామాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. సంబంధిత, ఆర్ అండ్ బి , జాతీయ రవాణా అధికారులు నిధులు కేటాయించి గూడప్పాడు కూడలిని ‘గూడప్పాడు జంక్షన్’గా అభివృద్ధి చేయాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
