Preloader

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, వైద్య పరీక్షలు, మందుల నిల్వలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రక్త పరీక్షల వివరాలు, రోజువారీ పరీక్షల సంఖ్య, అవసరమైన పరికరాలు, సామగ్రి అందుబాటుపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మందుల గదిని పరిశీలించిన కలెక్టర్, వివిధ రకాల మందుల నిల్వలను తనిఖీ చేశారు. అత్యవసర వైద్య అవసరాలకు ఉపయోగించే సిరంజీలు అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. ఇంటర్నెట్ సమస్యల కారణంగా మందులు, వైద్య సామగ్రి సరఫరా ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ఇండెంట్ పెట్టామని వైద్యాధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సిరంజీలు, మందులు, ఇతర వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు.ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, మందులు, భోజన సదుపాయాలు, ఆసుపత్రిలోని ఇతర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో పరీక్షలు చేస్తున్నారా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీసి, రోగులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తనిఖీలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించి, మందులు, వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలని, వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు.ఈ తనిఖీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, తహశీల్దార్ సంగీత, ఎంపీడీఓ బాలరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

30 October 2026

మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

www.jaibharatvoice.com