( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన గణనాథుల మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా యువత మొదలుకొని పెద్దలు, మహిళలు, చిన్నారులు అందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని కొలిచారు.

మహిళల ప్రత్యేక పూజలు:
ఉత్సవాల సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలచే కుంకుమ పూజార్చనలు, లలితా సహస్రనామ పారాయణం చేస్తూ మంగళ హారతి తో ఘనంగా నిర్వహించారు. వినాయకుని ముందు మహిళలు మేళతాళాలతో భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అన్నదానాలు, భజనలు:
తొమ్మిది రోజుల పాటు వివిధ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు చేపట్టారు. భక్తులకు ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. రాత్రి వేళల్లో యువకులు, పెద్దలు కలిసి కోలాటాలు, భజన కార్యక్రమాలు నిర్వహించి వక్రతుండని మనసారా సేవించారు.

ఘనంగా నిమజ్జనోత్సవం:
ఉత్సవాల చివరి రోజున గణనాథుల నిమజ్జనోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. గణపతి పాటలు డప్పు వాయిద్యాల నడుమ “గణపతి బప్పా మోరియా” నినాదాలతో యువత ఉత్సాహంగా ట్రాలీ, ట్రాక్టర్ లలో నిమజ్జనానికి తరలివెళ్లారు. ఊరూరా ఉన్న చెరువుల వద్ద గణేశుని విగ్రహాలను భక్తితో నిమజ్జనం చేశారు.

పోలీసుల భారీ బందోబస్తు:
కటాక్షపూర్ చెరువు వద్ద నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు సీఐ బాబూ లాల్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టి, చెరువుల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూ, భక్తులు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో భక్తులు, నిర్వాహకులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానిమజ్జనంను ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ జగన్ మోహన్ రెడ్డి పర్యవేక్షించారు.
