(జై భారత్ వాయిస్, ఆత్మకూరు
కష్టాన్ని నమ్ముకుంటే కాలమే కలిసొస్తుందనడానికి నిదర్శనం ఆత్మకూరు మండలం గూడెప్పాడుకు చెందిన బలభద్ర జితేందర్ రాణించాడు.
జీవనోపాధి లేక జితేందర్ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని భివాండీకి చేనేత పని కోసం వలస వెళితే అక్కడే జితేందర్ ప్రాథమిక విద్య చదివాడు. పరిస్థితులు అనుకూలించక తిరిగి ఆత్మకూరు వచ్చి పదవ తరగతి వరకు చదివి ఇంటర్ తర్వాత కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారాడు.
దాదాపు 15 సంవత్సరాల పాటు ఆత్మకూరు నుంచి వరంగల్, హన్మకొండ పట్టణాలకు ఆటో నడుపుతూనే కిరాణా, ఎలక్ట్రికల్, ప్లంబర్ సామాన్లను వరంగల్ నుంచి తెచ్చి ఆత్మకూరులోని దుకాణాలకు సప్లై చేసేవాడు. ఆ కిరాయితోనే జీవితం గడిపాడు.
కరోనా విపత్తుతో ఆటోలు ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆ కష్టమే ఆయనకు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ధైర్యం చేసి ఆత్మకూరులో ‘మహాలక్ష్మి ఎలక్ట్రికల్స్ ‘అనే సొంత షాపును ప్రారంభించాడు
.
“మొదట్లో నడుస్తుందో లేదో అని భయపడ్డా” అని జితేందర్ చెప్పారు. కానీ మిగతా దుకాణాలతో పోటీ పడుతూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు ప్లంబర్, పెయింట్స్ సామాన్లు కూడా అమ్మకం ప్రారంభించాడు. నేడు జీవనం కుదుటపడిందని, స్థానిక బ్యాంక్ సహకారం కూడా ఉందని ఆనందంగా చెబుతున్నాడు.కష్టే ఫలి అనడానికి జితేందర్ జీవితమే నిదర్శనం.
